తల్లిదండ్రులకు జేపి వినతి
హైదరాబాద్ : ఓటు వేసే ముందు తమ బిడ్డల భవిష్యత్తును తలచుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక తాయిలాలు, ప్రజలను బిచ్చగాళ్ళను చేసే పథకాలు కాకుండా వారి జీవితాలను శాశ్వతంగా బాగుచేసే అంశాన్ని తమ పార్టీ ఓ పవిత్ర కర్తవ్యంలా చేసి చూపించిందని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్కారు పాఠశాలల అభివృద్ధికి ఏటా 25 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని, వాటిలో ప్రతి పైసా సద్వినియోగం అయితే, కేవలం ఐదేళ్ళలో అన్ని పాఠశాలలనూ సౌకర్యంగా తీర్చిదిద్దవచ్చన్నారు. వరుణ యాగం చేస్తే వర్షాలు పడతాయని చెప్పే ఈ ప్రభుత్వం ఇక పిల్లలకు మంచి విద్యను ఎలా అందించగలదని జేపీ ఎద్దేవా చేశారు. పన్నులు కట్టేది మీరు, ప్రభువులే మీరు, మీకు అందాల్సిన సేవల్లో విఫలమవుతున్న ప్రభుత్వాలని నిలదీయడం నేర్చుకోండని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఓట్లు అమ్ముకున్నంతకాలం ఈ రాజకీయాలు మారవని, రాజకీయాలు మారనంతవరకూ ప్రజల జీవితాలు బాగుపడే ప్రశ్నే ఉండదని జేపీ హెచ్చరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో జేపి మాట్లాడారు.
ఈ పాఠశాలను లోక్ సత్తా పార్టీ దత్తత తీసుకొని పదిహేను రోజుల్లో అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దింది. తల్లిదండ్రులతో కమిటీని ఏర్పాటుచేసి పాఠశాల స్వచ్ఛంద సంరక్షణ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక ఉత్సవంలా నిర్వహించిన కార్యక్రమానికి జేపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో జేపి ఉద్విగ్నంగా మాట్లాడారు. తన జీవితంలో అనేక సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ ఇది చాలా విశిష్ట సమావేశం అన్నారు. పాఠశాలల సీజన్ మొదలయ్యాక ప్రభుత్వ పాఠశాలల పనితీరు, బడిబాట కార్యక్రమాలను పరిశీలించేందుకు లోక్ సత్తా బృందాలు జూన్ మూడో వారంలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలను పరిశీలించాయన్నారు. ఈ సందర్భంగా హైదర్ నగర్ ప్రాథమిక పాఠశాల దుస్థితిని తమ పార్టీ బృందాలు గమనించాయన్నారు. ఈ పాఠశాల అటెండర్ ప్రమీల 'ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఒక్కటే' అంటూ చేసిన వ్యాఖ్యతో తమ పార్టీ కార్యకర్తలు తక్షణం స్పందించారన్నారు. పార్టీ కార్యకర్తలు 60 వేల రూపాయలు చందాలు వేసుకొని, శ్రమదానం చేసి పదిహేను రోజుల్లో పాఠశాలను బాగుచేయడం ముదావహం అన్నారు.
అనంతరం నిజాంపేట వద్ద కబ్జాకు గురైన జిల్లా పరిషత్ హైస్కూల్ ను జేపి సందర్శించారు. పాఠశాల స్థలంలో నాలుగో వంతు ఆక్రమణకు గురైందని, సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన భూమిని స్థానిక రాజకీయ నాయకుల అండతో ఆక్రమించారని పార్టీ నాయకులు జేపికి వివరించారు. ఈ కబ్జాపై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి రాజకీయ కబ్జాదారుల ఆగడాలను అడ్డుకునేలా ప్రజలను చైతన్యపరచాలని జేపి సూచించారు. అంతకు ముందు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని కెపిహెచ్ బి కాలనీ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జేపి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
News Posted: 4 July, 2009
|