మెట్రో భూ సేకరణపై రీ సర్వే
హైదరాబాద్ : నగరంలో మెట్రో రైలు ప్రతిపాదనను ఏకపక్షంగా తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మేటాస్ సంస్థతో ఒప్పందం రద్దయ్యాకైనా సక్రమంగా ఆలోచించాలని లోక్ సత్తా పార్టీ విజ్ఞప్తి చేసింది. మేటాస్ సంస్థతో జరిగిన ఒప్పందంలోని అనేక అంశాల్లో పారదర్శకత లేదని, అందుకే మెట్రో రైలు ప్రాజెక్టు కోసం చేసిన భూ సేకరణపై వెంటనే రీ సర్వే చేయించాలని డిమాండ్ చేసింది. నగరంలో ఎంఎంటిఎస్ ఫేజ్ 2 ను తక్షణ అవసరంగా చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. లోక్ సత్తా అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, వి. లక్ష్మణ్ బాలాజీ బుధవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు.
రవాణా రంగ నిపుణులు, పౌర సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా బహిరంగ చర్చ నిర్వహించకుండా ప్రభుత్వం హడావుడిగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిందని లోక్ సత్తా అధికార ప్రతినిధులు ఆరోపించారు. ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా లేవా అనే ఆలోచన లేకుండా దీన్ని ఎలాగోలా పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నది కనుక, ఈ లోగా ప్రజలకు ఎదురవుతున్న తక్షణ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. మెట్రో ప్రాజెక్టు మొదలయ్యేటప్పటికే కొన్ని నెలలు పడుతుందని, పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చే సరికి కనీసం మరో పదేళ్ళు పడుతుందని వారు వ్యాఖ్యానించారు. మెట్రో పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహంలో సగమైనా రాజధాని ప్రజల జీవితాన్ని నరకంగా మారుస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చూపాలని లోక్ సత్తా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
News Posted: 8 July, 2009
|