ముగిసిన `పారిశుధ్య' సమ్మె
హైదరాబాద్ : జంట నగరాల్లో గత మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను పారిశుధ్య కార్మికులు బుధవారం విరమించారు. చెత్త నిర్వహణ, పారిశుద్ధ్య పనులను రాంకీ సంస్థకు అప్పగించడంతో జిహెచ్ ఎంసి పారిశుధ్య కార్మికులు ఆదివారం నుంచి సమ్మె ప్రారంభించారు. జిహెచ్ ఎంసి కార్మిక సంఘాలు బల్దియా కమిషనర్ ఎస్ పి సింగ్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు పారిశుధ్య కార్మిక సంఘం ప్రకటించింది. కార్మిక సంఘాలు లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే రాంకీ సంస్థకు పనులు అప్పగించే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి బిఎంఎస్ నాయకుడు శంకర్ ఆధ్వర్యంలో సమ్మె ప్రారంభించిన కార్మికులు కమిషనర్ హామీతో సమ్మె విరమించారు. అయితే ఈ సమ్మెలో ఐఎన్ టియుసి మాత్రం పాల్గొనలేదు.
జంటనగరాల్లో చెత్త నిర్వహణ, పారిశుధ్యం పనులను ప్రేవేటు సంస్థకు అప్పగిస్తే బల్దియాలో 2,900 మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉండడంతో సమ్మెకు దిగారు. చివరికి జిహెచ్ ఎంసి కమిషనర్ ఎస్పీ సింగ్ తో బుధవారం జరిగిన చర్చల్లో అంగీకారం కుదిరి, సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.
News Posted: 8 July, 2009
|