కాంగ్రెస్ అధికార దుర్వినియోగం
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి చేసిన వార్డుల రిజర్వేషన్ ప్రక్రియలో శాస్త్రీయత, హేతుబద్ధత లేదని లోక్ సత్తా పార్టీ విమర్శించింది. పాలక కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఉండేలా రిజర్వేషన్లు చేసిందన్న విషయం జాబితాను పరిశీలిస్తే అర్థమవుతుందని లోక్ సత్తా అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, వి. లక్ష్మణ్ బాలాజీ అన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళల జానాభా డివిజన్ల వారీగా ప్రకటించకుండానే వార్డులు కేటాయించారన్నారు. రాజ్యాంగం ప్రకారం బీసి, ఎస్సీ, ఎస్టీ, మహిళ జనాభా డివిజన్ల వారీగా ప్రకటించకుండానే వార్డులు కేటాయించారన్నారు.
మరో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిసిలు ఉన్నచోట ఎక్కువ బీసీ రిజర్వేషన్లు, ఓసీలున్నచోట జనరల్ కేటగిరీ రావడం యాదృచ్ఛికం కాదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్నారు. వార్డుల పునర్విభజనతో మొదలుపెట్టి గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం పాలకపక్షం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరును శ్రీనివాసరావు, లక్ష్మణ్ బాలాజీ బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. అధికార పార్టీ తీరు వల్ల రిజర్వేషన్ల లక్ష్యమే నీరుగారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గురించి మాట్లాడడాన్ని లోక్ సత్తా తప్పుపట్టింది. క్యాబినెట్ సమావేశాన్ని పార్టీ ఎన్నికల వేదికలా మాట్లాడిని వైఎస్ తీరు గురించి వారు ప్రస్తావించారు. మంత్రులు తమ పనులు ఆపేసి గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పడం శోచనీయం అన్నారు. హైదరాబాద్ లో ఒక్క రోడ్డును కూడా ఈ సర్కార్ బాగు చేయించలేదని, డ్రైనేజి వ్యవస్థను పట్టించుకోలేదని, ప్రయాణం నరకాన్ని తలపిస్తున్నా రోడ్డు విస్తరణ చేయలేదని, ఏం చేశారో తెలియకుండానే 5,500 కోట్ల రూపాయలు గ్రేటర్ అభివృద్ధికి ఖర్చుచేశామని చెప్పడంలో ఔచిత్యం లేదన్నారు. డ్రైనేజి వ్యవస్థ ఆధునికీకరణకు 10 వేల కోట్లతో ఇప్పటికిప్పుడు పథకాన్ని ప్రకటించడం పక్కా ఎన్నికల గిమ్మిక్కని అన్నారు. ఇలాంటి చర్యలకు స్వస్థి చెప్పి అధికార పక్షం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని శ్రీనివాసరావు, బాలాజీ డిమాండ్ చేశారు.
News Posted: 16 July, 2009
|