లోక్ సత్తా వార్డు ప్రభుత్వాలు
హైదరాబాద్ : 'వార్డు ప్రభుత్వం' అనే కీలక ఎజెండాతో లోక్ సత్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో దిగుతున్నదని ఆ పార్టీ అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, గ్రేటర్ విభాగం అధ్యక్షుడు ఎన్. రవీందర్ పేర్కొన్నారు. ప్రజల చేతికి అధికారాన్ని, నిధులను ఇచ్చి హైదరాబాద్ ను ఐదేళ్ళలో అత్యుత్తమ జీవనయోగ్య నగరంగా తీర్చిదిద్దే నిర్దిష్ట ఎజెండాను తాము ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని వారు వివరించారు. 'ఓటు లోక్ సత్తాకు - అధికారం ప్రజలకు' అనే సందేశంతో 25న జరిగే బహిరంగ సభతో తమ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ గ్రేటర్ ఎన్నికల ప్రచార భేరి మోగిస్తారని చెప్పారు. ఆ రోజు నుంచి వరుసగా జేపి, ఇతర రాష్ట్ర నాయకులు హైదరాబాద్ లో పర్యటిస్తారన్నారు. జిహెచ్ ఎంసి ఎన్నికల వ్యూహంపై జేపి ఆధ్వర్యంలో జరిగిన చర్చల వివరాలను ఆ పార్టీ ప్రతినిధులు శ్రీనివాసరావు, రవీందర్ సోమవారంనాడు పార్టీ ప్రధాన కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
సంప్రదాయ పార్టీలు అధికారం చెలాయించేందుకు వస్తే, ప్రజలకు అధికారం ఇచ్చేందుకే లోక్ సత్తా రాజకీయాల్లోకి వచ్చిందని శ్రీనివాసరావు, రవీందర్ పేర్కొన్నారు. 25న జరిగే బహిరంగ సభా వేదిక మీదే లోక్ సత్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల అభ్యర్థులను జేపి ప్రకటిస్తారని వారు తెలిపారు. సభా వేదిక తదితర వివరాలను ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని లోక్ సత్తా ప్రతినిధులు చెప్పారు.
News Posted: 20 July, 2009
|