'నగర జనాన్ని ముంచే నీరు'
హైదరాబాద్ : మంచినీరు పేరుతో నగరంలో ప్రభుత్వం సరఫరా చేస్తున్నది సురక్షితమైనది కాదని, జనం ప్రాణాలను హరించే బ్యాక్టీరియా కాలుష్యంతో కూడుకున్నదని లోక్ సత్తా పార్టీ వెల్లడించింది. భోలక్ పూర్ లో సరఫరా చేసన కలుషిత నీరు తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరిగిన తరువాత కూడా ఈ సర్కార్ కళ్ళు తెరవలేదని లోక్ సత్తా కళ్ళెర్రజేసింది. నగరంలో తమ బృందం 99 చోట్ల సేకరించిన మంచినీటి నమూనాల్లో కేవలం 3 చోట్ల మాత్రమే రెసిడ్యువల్ క్లోరిన్ (ఆర్.సి.) స్థాయిలు సక్రమంగా ఉన్నట్లు గుర్తించినట్లు లోక్ సత్తా అధికార ప్రతినిధి కటారి శ్రీనివాసరావు, సర్వే సమన్వయకర్త కె. శివరామకృష్ణ తెలిపారు. మంగళవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని వారు వ్యాఖ్యానించారు.
గ్రామాలకు మిలరల్ వాటర్ బాటిళ్ళను సరఫరా చేస్తామంటూ వైఎస్ సర్కార్ చేసిన ప్రకటన చూస్తే 'ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుంద'న్న సామెత గుర్తుకు వస్తోందని లోక్ సత్తా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజధానిలోనే ఇలా మంచినీటిలో బ్యాక్టీరియా సరఫరా అయిపోతుంటే మిగిలిన చోట్ల ఆలోచించేముంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరాలో కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించడం లేదని వారు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ప్రజలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య సేవలు అందించే బాధ్యతను పూర్తిగా విస్మరించి, వైద్యసేవలను ప్రైవేటుపరం చేస్తున్న ప్రభుత్వం కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వకుండా ప్రజలను వ్యాధుల బారిన పడేస్తోందని లోక్ సత్తా ప్రతినిధులు విమర్శించారు. నీటి సరఫరాలో కనీస ఆమోదయోగ్యమైన నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
News Posted: 21 July, 2009
|