హైదరాబాద్ : నెలలో ఒకరోజు అయినా కలెక్టర్లు హాస్టళ్ళలో ఉండి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యోర్థుల సమస్యలపై కలెక్టర్లు దృష్టి సారించాలని సిఎం పేర్కొన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యల గురించి కలెక్టర్లతో చర్చించారు. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ను మరో ఆరు రోజుల్లో ఇస్తానని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయ పంటలతో ఖరీఫ్ కు సిద్ధంగా ఉన్నామని సిఎం తెలిపారు. వరికి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు వారం రోజుల్లో సరఫరా చేస్తామన్నారు.
ఆగస్టు 15 నుంచి బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం ప్రారంభం అవుతుందని వైఎస్ చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరల అదుపుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను కోరారు. అక్రమ నిల్వలలో స్వాధినం చేసుకున్న బియ్యం నిల్వలలను మార్కెట్ లోకి విడుదల చేయాలని ఆదేశించారు. మంచినీటి సరఫరాపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత అని వైఎస్ అన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం అయితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అధికారులు అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్లకు సిఎం సూచించారు.