పోరాడే శక్తి టిడిపిదే : బాబు
హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో సామాన్యులు తమ పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బిజెపి ఎల్ బినగర్ పట్టణాధ్యక్షుడు జిట్టా రాజశేఖరరెడ్డి, ఎబివిపి జోనల్ ఇన్ చార్జి మధుసూధన్ రెడ్డిలు తెదేపా ఎల్బీ నగర్ నియోజకవర్గ ఇన్ ఛార్జి ఎస్ వి.కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులను విపరీతంగా పెంచేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సామాన్యులు చదువును కొనసాగించలేక మధ్యలోనే వదిలివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదరికం లేని సమాజ నిర్మాణమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. గతంలోఆర్థిక పరిస్థితులు సరిగా లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన చేనేత కార్మికుల ఆత్మహత్యలతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాడే శక్తి తెదేపా శ్రేణులకే ఉందని బాబు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు. పార్టీలో చేరే వారికి తగిన గుర్తింపునిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
News Posted: 24 July, 2009
|