పట్టణాల్లో స్థానిక కోర్టులు: లోక్ సత్తా
హైదరాబాద్ : గ్రామ న్యాయాలయాల బిల్లు అమలులో భాగంగా పట్టణాల్లో కూడా స్థానిక కోర్టుల ఏర్పాటు చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామాల్లో ప్రతి 50 వేల మందికి, పట్టణాల్లో ప్రతి లక్ష జనాభాకు ఓ న్యాయస్థానం అందుబాటులో ఉంచాలని లోక్ సత్తా అధికార ప్రతినిధి వి. లక్ష్మణ్ బాలాజీ, ఎస్. మనోరమ అన్నారు. గత ఏడాది చివరిలో పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని విధివిధానాలను సూచిస్తూ లోక్ సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ మొన్న జనవరిలో ముఖ్యమంత్రికి లేఖ రాశారని, ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడక ముందే కోర్టుల ఏర్పాటుకు బడ్జెట్ కేటాయింపు తదితర చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. స్థానిక న్యాయస్థానాలకు మౌలిక వసతులు కల్పించడం, హైకోర్టు ద్వారా మేజిస్ట్రేట్ ల ఏర్పాటు, సివిల్ కేసుల్లో ఆస్తి పరిమితి తదితర అంశాలపై నిబంధనల రూపకల్పన దిశగా ప్రయత్నాలు చేయాలని వారు సోమవారం పార్టీ ప్రధానా కార్యాలయంలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
రాజ్యాంగం ఆర్టికల్ 39 ఎ లో పేర్కొన్న 'అందరికీ సమాన న్యాయం' అందించేందుకు గ్రామ న్యాయాలయాల ఏర్పాటు కీలకం అని లోక్ సత్తా ప్రతినిధులు అన్నారు. సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి తక్కువ ఖర్చుతో, వేగంగా తీర్పులు రావడం వల్ల సామాజికంగా ఆహ్వానించదగ్గ పరిణామాలు వస్తాయన్నారు. న్యాయం ఆలస్యం కావడం పట్ల ప్రజల్లో విశ్వాసం పోతోందని, నిస్పృహను తట్టుకోలేక అసలు కోర్టుల పక్కకే రాని కేసుల సంఖ్య పెండింగ్ కేసుల కంటే ఎక్కువవుతోందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని రౌడీ దర్బార్ల సంఖ్య పెరుగుతోందని లోక్ సత్తా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని ధ్రువ కాలేజ్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఆదివారంనాడు రూపాదేవి అనే విద్యార్థినిపై సహ విద్యార్థి దాడి చేయడానికి కాలేజి యాజమాన్యంతో పాటు విద్యా శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు కూడా బాధ్యత వహించాలని లోక్ సత్తా ప్రతినిధులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారికి కిలోమీటరు లోపల ఎలాంటి రక్షణా లేకుండా అడవి లాంటి ప్రదేశంలో ఉన్న ఆ కాలేజికి ఉన్నత విద్యా శాఖ, ఉస్మానియా వర్శిటీ పర్యవేక్షక బృందం ఎలా అనుమతించినట్లను వారు ప్రశ్నించారు. బాయ్స్, గరల్స్ హాస్టళ్ళకు ఒకే ప్రవేశద్వారం ఉందని, దీనితో ఎలాంటి అఘాయిత్యాలైనా ధ్రువ కళాశాలలో జరిగేందుకు అవకాశం ఉందని దుయ్యబట్టారు. ఈ విషయాలన్నీ తమ పార్టీ అధికార ప్రతినిధి కటారి శ్రీనివాసరావు, డివిఎస్ వర్మతో కూడిన బృందం సందర్శించినప్పుడు వెల్లడయిన వాస్తవాలన్నారు. రూపాదేవిపై దాడికి సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రేమోన్మాది, కళాశాల యాజమాన్యం, విద్యాశాఖ అధికారులపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బాలాజీ, మనోరమ డిమాండ్ చేశారు.
News Posted: 27 July, 2009
|