'కల్తీ మద్యంపై కఠిన చట్టం'
హైదరాబాద్ : కల్తీ మద్యం, కల్లు, గుడుంబా వ్యాపారాన్ని అణచివేసేందుకు గుజరాత్ తరహాలో కఠిన చట్టాలు తీసుకురావాలని లోక్ సత్తా డిమాండ్ చేసింది. మద్యాన్ని ఓ సమస్యగా కాకుండా ఆదాయ మార్గంగా ప్రభుత్వం భావించడం వల్ల బెల్ట్ షాపుల పేరుతో అనధికార మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నయని, కల్తీ మద్యం యథేచ్ఛగా ప్రవహిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని లోక్ సత్తా అధికార ప్రతినిధి కటారి శ్రీనివాసరావు, మహిళా సత్తా రాష్ట్ర కన్వీనర్ ఎన్. సరోజాదేవి దుయ్యబట్టారు. మద్యం వల్ల ఏర్పడే దుష్పరిణామాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చడమే అంతిమ పరిష్కారం అని వారు స్పష్టం చేశారు.
కల్తీ మద్యం కారణంగా మరణాలతో పాటు పెద్ద ఎత్తున తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలను, తద్వారా అకాల మరణాలను పరిశీలిస్తే గుండెలు పిండినట్లవుతున్నదని లోక్ సత్తా ప్రతినిధులు అన్నారు. ఈ పరిస్థితుల్లో కల్తీ మద్యం వ్యాపారం మీద ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ ఎక్సైజ్ చట్టాన్ని కఠినతరం చేయడం, సమర్థంగా అమలుచేయడం అవసరమని శ్రీనివాసరావు, సరోజాదేవి బుధవారంనాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఏడాదిన్నర కాలంగా లోక్ సత్తా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక బెల్టు షాపులను గుర్తించి ప్రభుత్వానికి తెలిపినా కనీస చర్యలు కూడా తీసుకోలేదని లోక్ సత్తా ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు.
News Posted: 30 July, 2009
|