వెబ్ కౌన్సెలింగ్ వద్దు: లోక్ సత్తా
హైదరాబాద్ : ఎంసెట్ కౌన్సెలింగ్ లో వెబ్ విధానం తీవ్ర గందరగోళంగా ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నందున వెంటనే రద్దు చేయాలని లోక్ సత్తా పార్టీ డిమాండ్ చేసింది. ఇంజనీరింగ్ సీట్లను వేలం వేసి మరీ అమ్ముకుంటున్న యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని లోక్ సత్తా అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, వి. లక్ష్మణ్ బాలాజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొత్తం 641 ఇంజనీరింగ్ కళాశాలల్లో 577 కళాశాలల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతోందని, దీనివల్ల సుమారు మూడు వేలకు పైగా కాంబినేషన్లలో విద్యార్థి తనకు కావలసింది వెబ్ లో ఎంచుకోవాల్సి వస్తోందన్నారు. ఈ విధానం అర్థం కాక అనేక మంది విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారన్నారు. ఎంసెట్ రాసిన విద్యార్థుల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారున్నారని, పరీక్ష రాశాక వీరు తమ ఊళ్ళకు వెళ్ళారని, అక్కడ ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల తిరిగి వచ్చి వారు కేవలం కౌన్సెలింగ్ కోసమే పట్టణాల్లో ఉండాల్సి వస్తోందన్నారు.
చివరికి వెబ్ లో ఏమి జరుగుతున్నదో అంతు చిక్కక ఏది వస్తే అది తీసుకోవాల్సిన పరిస్థితి విద్యార్థులకు ఏర్పడుతోందని లోక్ సత్తా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థుల తల్లిదండ్రుల్లో చాలా మందికి అసలు కంప్యూటర్ పరిజ్ఞానమం ఉండదన్నారు. వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఇలాంటి విద్యార్థులకు తీరని అన్యాయం చేయడమే అని వారు విమర్శించారు.
News Posted: 31 July, 2009
|