'ఆర్వో ప్లాంట్లపై అబద్ధాలు'
హైదరాబాద్ : ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీరు అందించాలనే ప్రభుత్వ ఆలోచన హర్షణీయం అని, అయితే ప్రతి మండలానికీ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ (ఆర్వో ప్లాంట్) ఏర్పాటు చేసి మంచినీరు ఇచ్చే ప్రయత్నం మాత్రం అర్థరహితమని, ప్రజలను మభ్యపెట్టడమే అని లోక్ సత్తా వ్యాఖ్యానించింది. నీటి నమూనాలపై సర్వే చేసిన తరువాత మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్వో ప్లాంట్ ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని ఆ పథకం మీద ఏర్పాటు చేసిన కమిటీ సూచించిందని లోక్ సత్తా అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, వి.లక్ష్మణ్ బాలాజీ, సాంకేతికాంశాల సలహాదారు కె. శివరామకృష్ణ పేర్కొన్నారు. అయితే కమిటీ సూచనలను రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
ఆర్వో ప్లాంట్ల కోసం ప్రభుత్వం ఆగమేఘాల మీద టెండర్లు పిలవాల్సిన అవసరం ఏమిటని, దీని ద్వారా ఎవరికి ఎలాంటి చట్ట విరుద్ధమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయని లోక్ సత్తా ప్రతినిధులు ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వారు పేర్కొన్నారు. మండలానికి ఒకటి అని మూకుమ్మడి విధానం కాకుండా ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక గ్రామాలకు ముందుగా ఆర్వో ప్లాంట్ల ద్వారా రక్షిత మంచినీరు అందించాలని శ్రీనివాసరావు, బాలాజీ, శివరాం శనివారం ఇక్కడ లోక్ సత్తా పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, ప్రజల నుంచి 20 లీటర్ల క్యాన్ కు రెండు రూపాయలు లేదా రూపాయ వసూలు చేసే బదులు స్థానిక ప్రభుత్వాలకు అధికారాలిచ్చి, ప్రజలకు తలసరి ఏటా వెయ్యి రూపాయలు కేటాయించాలన్నారు. ఐదు వందల జనాభా ఉన్న గ్రామానికి రూ. 50 లక్షలు అందించాలని అన్నారు. ఆ డబ్బుతో ప్రజలే ఎక్కడికక్కడ ఆర్వో ప్లాంట్ల ద్వారా, ఇతర మార్గాల ద్వారా రక్షిత మంచినీటి ఏర్పాట్లు చేసుకునే అవకాశం, ఇతర స్థానిక సమస్యలను పరిష్కరించుకునే ఏర్పాట్లు చేయడం సరైన పరిష్కారమని లోక్ సత్తా ప్రతినిధులు తెలిపారు.
News Posted: 1 August, 2009
|