వర్షాభావంపై ముందుచూపేది
హైదరాబాద్ : జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు సరిగా పడకపోయినప్పటికీ ప్రభుత్వం ఆచరణాత్మకంగా స్పందించకుండా, యజ్ఞ యాగాదులతో కాలక్షేపం చేసిందని లోక్ సత్తా పార్టీ విమర్శించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు రాష్ట్ర రైతులు కరవు కోరల్లో చిక్కుకుపోయారని, నైరాశ్యానికి గురై కుంగిపోతున్నారని లోక్ సత్తా అధికార ప్రతినిధులు లక్ష్మణ్ బాలాజీ, రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే మేలుకొని ప్రత్యామ్నాయాలను చూపుతూ, సహాయం అందించి, వర్షాలు ఆలస్యమైనా, నిర్దిష్ట ప్రత్యామ్నాయాలతో ముందుకెళ్తే సంక్షోభాన్ని అధిగమించగలమనే వాస్తవాన్ని రైతులకు తెలియజేసి వారిలో స్థైర్యాన్ని నింపాలి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడే ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్న విజ్ఞత, ముందుచూపు పాలకుల్లో కొరవడడంతో వ్యవసాయం, గ్రామీణ జీవనం అగమ్యగోచరంగా మారాయని లోక్ సత్తా వ్యాఖ్యానించింది.
వర్షాల సీజన్ మొదలైనప్పటి నుంచీ ఏ నెలలో ఎంత వర్షపాతం ఉంటే ఎలాంటి పంటలు వేసుకోవాలో రైతులకు తెలియజేస్తే వారు ఎలాంటి ఒడిదుడుకులకైనా సిద్ధంగా ఉండేవారని లోక్ సత్తా ప్రతినిధులు అన్నారు. 2002లో ఇలాంటి పరిస్థితే ఎదురైనా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా ఉండడం వల్లే రాష్ట్రంలో అనేక మంది కరవురక్కసికి బలైపోయారని వారు గుర్తు చేశారు. అప్పటి కరవు కారణంగా రైతులు భారీ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని వారు మననం చేశారు.
రాష్ట్రంలో వర్షాభావంపై యాభై రోజుల ఆలస్యంగా చైతన్యం తెచ్చుకున్న రాష్ట్ర సర్కార్ కేవలం 45 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం ఏమిటని లోక్ సత్తా ప్రతినిధులు నిలదీశారు. ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధరకు హామీ ఇవ్వాలని, పది వేల అగ్రి క్లినిక్ లు ఏర్పాటు చేయాలని, విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు అన్ని రకాల సలహాలు తక్షణం అందించే ఏర్పాటు చేయాలని సత్తా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
News Posted: 5 August, 2009
|