'రైతును దూషిస్తే క్షమించేదిలేదు' హైదరాబాద్ : మద్యానికి బానిసలైనందువల్లే అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ భువనగిరి ఎం.పి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగు యువత అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్, తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు నన్నూరి నర్సిరెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతులు వేసిన ఓట్లతో గెలిచిన రాజగోపాల్ రెడ్డి రెండు నెలల్లోనే వారిని అవమానించే స్థితికి చేరడం క్షమార్హం కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల పట్ల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని బహిర్గతం చేశాయన్నారు.
రాష్ట్రంలో ఒకవైపున కరవు విలయతాండవం కారణంగా అన్నదాతలు ఆత్మహత్యలను ఆశ్రయిస్తుంటే వారిని ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన ఎంపి ఇలా దారుణమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని టిడిపి యువత, విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో ఆత్మహత్యలు పెరగలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు అన్నారు. గత ఐదేళ్ళలో రాష్ట్రంలో ఆరు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం ఎం.పి.కి తెలియకపోవడం శోచనీయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల రాజగోపాల్ రెడ్డి అనుచితంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
News Posted: 11 August, 2009
|