అగ్రిక్లినిక్ లకు సత్తా డిమాండ్ హైదరాబాద్ : వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నందున ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర వ్యాప్తంగా కనీసం పదివేల అగ్రి క్లినిక్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని లోక్ సత్తా పార్టీ డిమాండ్ చేసింది. ఆగస్టులో చిన్న వానలే తప్ప పెద్దవి కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నందున ప్రభుత్వం వెంటనే ప్రతి 3 వేల ఎకరాలకూ ఒక అగ్రి క్లినిక్ ఏర్పాటు చేస్తే రైతులు ఈ ఏడాది నష్టాల బారిన పడకుండా బయటపడతారని లోక్ సత్తా ప్రధాన కార్యదర్శి జి. రాజారెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నందిపేట రవిందర్ పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ నిపుణులను కూడా ఏర్పాటు చేయాలని వారు కోరారు. కరవు పరిస్థితుల వల్ల రైతులు, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ అగ్రి క్లినిక్ లు సాయపడతాయన్నారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురిసినా రైతన్నలకు ఇంతవరకూ జరిగిన నష్టాన్ని పూడ్చడం సాధ్యంకాదని, అందుకే అగ్రి క్లినిక్ ల ఏర్పాటు ద్వారా ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాల సరఫరాను వేగంగా ప్రారంభించాలని లోక్ సత్తా నాయకులు అన్నారు. ఆహార ధాన్యాల సేకరణ, మార్కెటింగ్, నిల్వల ప్రజాపంపిణీ విషయంలో నిర్దిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాజారెడ్డి, రవీందర్ కోరారు.
News Posted: 12 August, 2009
|