స్వైన్ ప్లూపై లోక్ సత్తా డిమాండ్ హైదరాబాద్ : దేశంలో వేగంగా వ్యాపిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి రాష్ట్రంలో మరింతగా ప్రబలకుండా తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని లోక్ సత్తా పార్టీ డిమాండ్ చేసింది. ప్రజల్లో స్వైన్ ఫ్లూ భయాందోళనలు పెరుగుతున్నందున ప్రభుత్వం వెంటనే అవగాహన, చికిత్సకు చర్యలు తీసుకోవాలని, సరిపడినంతగా మందులు సిద్ధం చేయాలని లోక్ సత్తా ప్రధాన కార్యదర్శి జి. రాజారెడ్డి, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నందిపేట రవీందర్ కోరారు.
స్వైన్ ఫ్లూ వ్యాధి సాధారణ జ్వరాల కంటే కొంత ప్రమాదకరం అయినందున మందులు అందరికీ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని లోక్ సత్తా నాయకులు తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రభుత్వం స్వైన్ ఫ్లూ అవగాహన, సలహా కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
స్వైన్ ఫ్లూ విషయంలో ప్రజలు కూడా ఆందోళన చెందవద్దని, సరైన పరిశుభ్రత పాటించి, జ్వరం, జలుబు, దగ్గు, తలతిరుగుడు, తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రతించి, జాగ్రత్తలు తీసుకోవాలని లోక్ సత్తా నాయకులు తెలిపారు. ఈ లక్షణాలున్న వారు వైద్యులను సంప్రతించి వారి సూచన మేరకు మందులు వాడితే స్వైన్ ఫ్లూ వల్ల ప్రాణాపాయం ఉండబోదని రాజారెడ్డి, రవీందర్ స్పష్టం చేశారు.
News Posted: 12 August, 2009
|