యువతలో సాహసం రగల్చాలి హైదరాబాద్ : కొత్త పుంతలు తొక్కడానికి, సమాజాన్ని సరికొత్తగా నిర్మించడానికి కావలసింది నిజమైన ధైర్యం అని, అలాంటి సాహసాన్ని యువతలో రగిల్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రస్తుతం దేశానికి ఎంతో ఉందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. సాహసాలు చేసేవారు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అవసరమైతే తాత్కాలిక లాభాలను పక్కన పెడతారని, ప్రజలను ఆకర్షణీయంగా ఉన్న ఇది సరైంది కాదనుకుంటే, నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారని పేర్కొన్నారు. అలాంటి వారే నిజమైన నాయకులని, అలాంటి నాయకులను పెద్ద ఎత్తున తయారుచేసుకోవాలని జేపి అన్నారు.
అడ్వంచర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హిమాలయ ఎత్తయిన పర్వతారోహణ కార్యక్రమాన్ని శుక్రవారం లోక్ సత్తా ప్రధాన కార్యాలయంలో జేపి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 4 వరకూ జరిగే ట్రెక్కింగ్ లో 14 రాష్ట్రాల నుంచి అభ్యర్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 15 మంది దీనికి ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ 'సారా ఉమ్ గా పర్వత శ్రేణి'లోని పార్వతీలోయలో 15 వందల అడుగుల ఎత్తున ఉన్న చంద్రా సరస్సు వరకూ ఈ ఆరోహణ జరుగుతుంది. పర్వతారోహణకు సారథ్యం వహిస్తున్న ఆచార్య బాబు టి. రఘుతో పాటు అందులో రాష్ట్రం నుంచి పాల్గొంటున్న ఎస్. వినోద్ కుమార్, పి. ప్రణీత, ఆష్లే క్లీక్, రామ్మోహనరావు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేవలం పర్వతాలు ఎక్కడం, నదులు ఈతకొట్టడం నేర్చుకోవడం ఈ కార్యక్రమాల లక్ష్యం కాదన్నారు. సమస్యలను అధిగమించేందుకు కావలసిన సాహసాన్ని, నాయకత్వ లక్షణాల్ని, దేశ సమైక్యతా భావాన్ని, ప్రకృతితో సహజీవనాన్ని పెంపొందించడం వీటి పరమార్థం అన్నారు. ఈ రోజు మన యువతకు కావలసింది ఒకే దేశం, ఒకే ప్రజ అని జేపి స్పష్టం చేశారు. ఇంతకు ముందటి తరాలకు లేని సాంకేతిక విజ్ఞానం, అవకాశాలు ఈ తరానికి ఉన్నాయని, మన రాష్ట్రంలో సాహస క్రీడలకు, సమర్థ నాయకత్వం ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలని జేపి అన్నారు.
News Posted: 14 August, 2009
|