లోక్ సత్తా పటిష్టానికి చర్యలు హైదరాబాద్ : పార్టీని గ్రామస్థాయి వరకూ పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో కమిటీలను పునర్వ్యవస్థీకరించిన లోక్ సత్తా ఇప్పుడు జిల్లా స్థాయి కమిటీల ప్రక్షాళన ప్రారంభించింది. 2009 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పనిచేసిన వారిని గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించే లక్ష్యంతో ఎన్నికలు పూర్తయిన వెంటనే జిల్లా కమిటీలను అడ్ హాక్ గా పార్టీ ప్రకటించింది
జిల్లాల వారీగా పర్యటించి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో, నియోజకవర్గాలవారీగా పోటీచేసిన అభ్యర్థులతో చర్చించి నివేదికలు రూపొందించేందుకు ఆరు రాష్ట్ర స్థాయి 'పునర్వ్యవస్థీకరణ బృందాలు' ఈ నెల 0న నుంచి బయలుదేరి వెళ్ళాయి. ఒక్కో బృందంలో నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందాలు తమ సమీక్షలను పూర్తి చేశాయని, వీటిని 18వ తేదీన పార్టీ అగ్రనాయకత్వానికి సమర్పిస్తాయని లోక్ సత్తా అధికార ప్రతినిధులు వి.లక్ష్మణ్ బాలాజీ, కె. గీతామూర్తి సోమవారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.
పునర్వ్యవస్థీకరణ బృందాలు సమర్పించే నివేదికలపై 18, 19 తేదీల్లో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో విస్తృత చర్చ జరుగుతుంది. పార్టీని సమర్థవంతంగా, చిత్తశుద్ధితో నడిపించటంలో, కార్యక్రమాల నిర్వహణలో ప్రస్తుతం ఉన్న కమిటీల పనితీరును, ఎన్నికల్లో అభ్యర్థుల పోరాట పటిమను జిల్లాల్లో పరిస్థితిని విశ్లేషిస్తారు. వీటి ఆధారంగా జిల్లా కమిటీల కొత్త జాబితాను రూపొందిస్తారు. 20వ తేదీన జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించాక కమిటీల తుది జాబితాను ప్రకటిస్తారు అని లోక్ సత్తా ప్రతినిధులు తెలిపారు. పార్టీని ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వీలుగా, మున్సిపాల్టీ స్థాయి నుంచి చేపట్టాల్సిన కార్యక్రమాలపై 20న జరిగే రాష్ట్ర కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
గ్రామ న్యాయాలయాల చట్టం (2008)ని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తుందని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై లోక్ సత్తా నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్రంలో కేవలం 500 స్థానిక న్యాయాలయాలు సరిపోవన్నారు. అంతకు కనీసం మూడు రెట్ల న్యాయాలయాలు కావాలన్నారు.
News Posted: 17 August, 2009
|