గిరిజన ప్రాణాలంటే చులకన హైదరాబాద్ : గిరిజనుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఖాతరు లేకుండాపోయిందని లోక్ సత్తా పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో సగం చేసినా గిరిజన ప్రాంతాల్లో అంటురోగాల నిర్మూలన సాధ్యమవుతుందని లోక్ సత్తా అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, వై. రమాదేవి అన్నారు. లోక్ సత్తా ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా, టైఫాయిడ్, డయేరియా వ్యాధులు ప్రబలి పెద్ద సంఖ్యలో గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని వారు ఆరోపించారు. వ్యాధుల నివారణకు అవసరమైన మందులు, పౌష్టికాహారం పొట్లాలతో తక్షణమే వైద్య బృందాలను వ్యాధిపీడిత గిరిజన ప్రాంతాలకు పంపించాలని డిమాండ్ చేశారు.
గత రెండు నెలల్లో ఆదిలాబాద్ జిల్లాలో 60 మంది, విశాఖపట్నం జిల్లాలో 25 మందికి పైగా ఏజెన్సీ ప్రాంతంలో మరణించినట్లు మీడియా వార్తల ద్వారా తెలుస్తోందని లోక్ సత్తా ప్రతినిధులు పేర్కొన్నారు. వీరంతా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మరణించారని వారు ఆరోపించారు. గిరిజన ఆవాసాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీటి సదుపాయం లేదని, దాని వల్ల అక్కడ అంటురోగాలు ప్రబలి ప్రాణాలు బలిగొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
News Posted: 18 August, 2009
|