ప్రభుత్వాన్ని నిలదీయండి: బాబు హైదరాబాద్ : శాసనసభ, మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలు ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయాలని, తద్వారా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. టిడిపి ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మంగళవారం టిడిపి ఎమ్మెల్యేలకు నిర్వహించిన టిడిఎల్ పి శిక్షణా శిబిరంలో చంద్రబాబు ప్రసంగించారు. టిడిపి ప్రతినిధులు శాసనసభా వ్యవహారాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని సూచించారు. పరస్పర సహకారంతో పనిచేస్తూ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర సమస్యలపై సరైన హోం వర్క్ చేసి ఆదర్శ ప్రతినిధులుగా రాణించాలని సూచించారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ మాజీ కార్యదర్శి ఇ. సదాశివరెడ్డి మాట్లాడుతూ, 'క్వశ్చన్ అవర్ ప్రాధాన్యత, స్వల్పకాలిక చర్చలు, అత్యవసర అంశాలు, బిల్లులు, అసెంబ్లీ ప్రొసీజర్లు, పార్లమెంటరీ సంప్రదాయాల' గురించి వివరించారు. వివిధ పక్షాలకు సభలో సమయం కేటాయించే విధానం గురించి టిడిపి సభ్యులకు అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ క్రమంలో శాసనసభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన అర్థవంతమైన సమాధానాలు ఇచ్చి అనుమానాలు నివృత్తి చేశారు.
ఈ శిబిరంలో టిడిఎల్పీ ఉపనాయకులు గాలి ముద్దు కృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 19 August, 2009
|