కొత్త సభ్యులకు బాబు శిక్షణ హైదరాబాద్ : రాజకీయాలలో మరింతగా రాణించాలంటే ప్రజాభిమానంతో పాటు మీడియా కమ్యునికేషన్ చాలా ముఖ్యమని తెలుగుదేశం పార్టీ తరపున కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులకు ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సూచించారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు తమ వంతు కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రసార మాధ్యమాల పాత్ర, మీడియాతో సభ్యులు ఎలా వ్యవహరించాలనే అంశంపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో బాబు మాట్లాడుతూ నేటి హైటెక్ యుగంలో సాంకేతికపరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలిగితే మంచి ఫలితాలు పొందగలుగుతామని సభ్యులకు సూచించారు. మీడియాతో మాట్లాడేటప్పుడు చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా చెప్పేందుకు ప్రయత్నించాలన్నారు. బాడీలాంగ్వేజ్ తో పాటు భాషా పరిజ్ఞానాన్ని కూడా పెంచుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ల్యాప్ టాప్ వినియోగంపై సరైన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే మనకు కావల్సిన పూర్తి సమాచారాన్ని ఎప్పుడైనా సంపాదించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
శాసన మండలి సభ్యుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మీడియాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రసంగిస్తూ... మౌలిక సూత్రాలను పాటిస్తే సరిపోతుందని, నియోజకవర్గంతో పౌర సంబంధాలను మెరుగు పరచుకునేందుకు మీడియా చక్కని సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వాన్ని మనం తిట్టకుండా ప్రజలచేతనే ప్రభుత్వాన్ని తిట్టించాలని, ప్రజల కోసం చేసిన ఏదైనా మంచి పనిని మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటే గుర్తింపు దానంతట అదే వస్తుందని సూచించారు. తెలుగుదేశం పార్టీ నేత డా.ఎం.వి.మైసూరా రెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులు సభలో వ్యవహరించాల్సిన తీరు, సభలో ప్రస్తావించాల్సిన అంశాలను సూచించారు. ప్రశ్నోత్తరాల సమయం, సావధాన తీర్మానం, 344, జీరో అవర్ ను ఎలా ఉపయోగించుకోవాలి విపులీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ విధాన నిర్ణయక కమిటీ సభ్యులు, శాసనసభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి వందన సమర్పణ చేశారు.
News Posted: 25 August, 2009
|