మైసూరా! నీకు తెలీదా? హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.రోశయ్య చేతిలో మంత్రులు, మంత్రుల చేతిలో ముఖ్యమంత్రి లేరని, మంత్రిమండలి సమిష్టి బాధ్యతతో పని చేస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధులు కటకం మృత్యంజయం, ఎన్.తులసిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రోశయ్యకు మంత్రులపై పట్టు లేదని, మంత్రుల చేతిలో ముఖ్యమంత్రి ఉన్నారంటూ టిడిపి రాజ్యసభ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి చేసిన విమర్శను మృత్యుంజయం, తులసిరెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి రోశయ్య గతంలో ఆర్థిక మంత్రిగా 15 పర్యాయాలు అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారని, అన్ని శాఖలపై అపారమైన అనుభవం ఉన్నదని వారు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ కు ఢిల్లీలో ఉన్న అధిష్టానం చేతిలో రిమోట్ ఉన్నదని మైసూరారెడ్డి చేసిన విమర్శను ప్రస్తావిస్తూ ఇందులో రహస్యం ఏమీ లేదనీ, రిమోట్ కాదు హైకమాండ్ కు డైరెక్ట్ కంట్రోలులో ఉన్నామని వారు తెలిపారు. ఈ విషయాలన్నీ మైసూరారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలియదా? అని వారు ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వంపై తిరగబడండి అని ప్రజలకు పిలుపునివ్వడం విస్మయం కలిగించిందని వారన్నారు.
News Posted: 16 September, 2009
|