గ్రేటర్ పై సత్తా త్రిసభ్య కమిటీ హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు లోక్ సత్తా కమిటీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో పార్టీ సీనియర్ నాయకులు కటారి శ్రీనివాసరావు, ఎన్. రవీందర్, డాక్టర్ పాండురంగారావు సభ్యులుగా ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో లోక్ సత్తా ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతోంది. పార్టీకి గట్టి పునాది వేసి, జిహెచ్ ఎంసి ఎన్నికల్లో లోక్ సత్తా మంచి ఫలితాలు రాబట్టేందుకు వీలుగా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. జిహెచ్ ఎంసి అభ్యర్థుల శిక్షణ, వార్డులవారీగా మేనిఫెస్టోలు, ఎన్నికల ప్రచారం, నిర్వహణ తదితర విషయాలను ఈ త్రిసభ్య కమిటీ పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుంది.
ఇదే క్రమంలో సురాజ్య ఉద్యమాన్ని ఇంటింటింటికీ తీసుకెళ్ళి వార్డు ప్రభుత్వాలను సాధించే దిశగా పోరాటం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ ను నాలుగు జోన్లుగా విభజించి ఒక్కో జోన్ కు అధ్యక్ష, కార్యదర్శులను కూడా లోక్ సత్తా నియమించింది. మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, రాజేంద్రనగర్ నియోజకవర్గాలున్న పశ్చిమ జోన్ కు అధ్యక్షునిగా జె.కృష్ణారావు, కార్యదర్శిగా బి. సురేందర్ వ్యవహరిస్తారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట, సనత్ నగర్, నాంపల్లి నియోజకవర్గాలున్న ఉత్తర జోన్ కు అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీమతి ఎ. సుభాషిణి, ఎం. జగన్ ను నియమించారు. తూర్పు జోన్ లో ఉన్న ఉప్పల్, ఎల్బీనగర్, మలక్ పేట, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షునిగా ఎం. జస్వంత్ రెడ్డి, కార్యదర్శిగా ఎం. పాండురంగారావు నియమితులయ్యారు. కాగా దక్షిణ జోన్ బాధ్యులను త్వరలో ప్రకటిస్తారు.
జిహెచ్ ఎంసిలోని 80 డివిజన్లకు పార్టీ అభ్యర్థుల జాబితా సిద్ధంగా ఉందని, పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఆమోదించిన తరువాత జాబితాను విడుదల చేస్తామని లోక్ సత్తా కటారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జేపి డివిజన్లవారీగా ప్రచారం ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. వార్డు ప్రణాళికలను ఖరారు చేసిన డివిజన్లలో జేపి ముందుగా పర్యటిస్తారని శ్రీనివాసరావు తెలిపారు.
News Posted: 24 September, 2009
|