ఇస్రో సైంటిస్టులకు జేపి అభినందన హైదరాబాద్ : శ్రీహరికోట నుంచి పిఎస్ ఎల్వీ సి 14 ప్రయోగం విజయవంతం కావడం పట్ల లోక్ సత్తా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రయోగం ద్వారా రోదసిలోకి ప్రవేశించిన ఓషన్ శాట్ 2 ఉపగ్రహం ద్వారా జరిగే సముద్రాల అధ్యయనం మన వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఎంతో మేలు చేస్తుందని, ఆర్థిక వ్యవస్థ బలోపేతాని దోహదం చేస్తుందని లోక్ సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఈ అధ్యయన సమాచారం వల్ల భూ వాతావరణం, రుతుపవనాలను కచ్చితంగా అంచనా వేయగలుగుతామన్నారు. మత్స్య సంపదను గుర్తించేందుకు వీలవుతుందన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న భారత్ మున్ముందు ఈ రంగంలో సాహసోపేతమైన విధానాలు అమలు చేయాలని, దేశాభివృద్ధికి శాస్త్రవేత్తలు మరింత దోహదం చేయాలని జేపి ఆకాంక్షించారు. సరైన ప్రణాళిక, నిధుల కేటాయింపులో సమతుల్యత, నిజాయితీ, అమలులో అంకితభావం ఉంటే శాస్త్ర, సాంకేతికరంగాల్లో అద్భుతాలు సాధించగలమని మన శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారన్నారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు అహర్నిశలూ కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలను జేపి అభినందించారు.
News Posted: 24 September, 2009
|