ఉద్యమకారునికి జేపీ నివాళి హైదరాబాద్ : అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు అవిశ్రాంతంగా పోరాడిన డా.కె.బాలగోపాల్ అకాల మరణం పట్ల లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కావలసిన అన్ని అవకాశాలూ ఉన్నా, సమాజంలో మెజారిటీగా ఉన్న ఆర్తుల కన్నీళ్ళు తుడవడానికి ఆయన జీవితాన్ని వెచ్చించిన ఉద్యమకారుడు బాలగోపాల్ అని ఆయన అన్నారు. సామాన్యుడి అస్తిత్వాన్ని సంప్రదాయ పాలకుల చేత, సమాజంలోని ఉన్నతవర్గాల చేత గుర్తింపజేసేందుకు అలుపెరగకుండా పోరాడిన సామాజిక యోధుడ్ని తయారు చేసుకోవడానికి సమాజానికి ఎన్నో ఏళ్ళు పడుతుందన్నారు. లక్ష్యాల సాధన విషయంలోనే కాదు, వాటిసాధనలోనూ రాజీలేకుండా ఆయన పాటించిన విలువలు ఈనాటి యువతరానికి స్పూర్తినివ్వాలి అని జేపీ అన్నారు. శుక్రవారం ఉదయం గుడిమల్కాపూర్ లోని బాలగోపాల్ ఇంటివద్ద భౌతికకాయాన్ని సందర్శించి ఆయన నివాళులు అర్పించారు. బాలగోపాల్ కుటుంబసభ్యులకు, ఆయన సహచరులకు లోక్ సత్తా పార్టీ తరపున జయప్రకాష్ నారాయణ్ ప్రగాఢ సంతాపాన్ని, నైతిక మద్దతును తెలియజేశారు.
News Posted: 10 October, 2009
|