బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయం
హైదరాబాద్ : వరదలతో తాగునీరు కరువై రోగాల బారిన పడిన ప్రజలకు తాగునీటిని అందించడానికి అక్వా మాక్స్ సౌజన్యంతో మొబైల్ వాటర్ ప్లాంట్లను కర్నూలు, మహబూబ్ నగర్, రేపల్లె ప్రాంతాలకు పంపించామని ఎన్టీఆర్ ట్రస్ట్ సీఇఓ పి.రఘురామారావు ఒక ప్రకటనలో తెలిపారు. వరద బాధితులను ఏదో విధంగా ఆదుకోవాలంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆదేశాల మేరకు గత పది రోజులుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సెల్లార్ లో రేయింబవళ్ళు వందల సంఖ్యలో వాలంటీర్లు పనిచేస్తూ ఇప్పటి వరకు 2 కోట్లు విలువచేసే 64 ట్రక్కుల సహాయ సామాగ్రిని వరద ప్రాంతాలకు పంపించామని ఆయన చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలోనే వరద బాధిత ప్రాంతాల్లో 58 వైద్య బృందాలను రంగంలోకి దించి 1.8 లక్షల మంది రోగులకు వైద్య సేవలను అందించామన్నారు. అంతేకాక 60 లక్షల రూపాయల విలువ చేసే మందులను కూడా ట్రస్ట్ వైద్య సహాయక కేంద్రాల ద్వారా పంపిణీ చేశామన్నారు.
దాతలు సమర్పించిన 27 లక్షల రూపాయలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు సోమవారం అందించారని రఘురామారావు తెలిపారు. కేశినేని నాని 25 లక్షల రూపాయలను, పాపులర్ షూమార్ట్ సంస్థ లక్ష రూపాయలను, ఎం.సాంబశివరావు 50 వేల రూపాయలను, వెంగపూడి శంకరబాబు 50 వేల రూపాయలను అందజేశారన్నారు. ఆదిలాబాద్ నుంచి బోడా జనార్థన్ 200 క్విటాళ్ళ బియ్యం, ఖమ్మం జిల్లాకు చెందిన బనావత్ హరిసింగ్ నాయక్, జిల్లా తెలుగుయువత కార్యదర్శి 25 వేల రూపాయలు విలువచేసే చీరలు, బియ్యం, నగదు అందించారని తెలిపారు. ఇప్పటి వరకు 50 వేల ఆహార పొట్లాలు, 7 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 40 లక్షలు విలువ చేసే బియ్యం, ఇతర ఆహార సామాగ్రి, 70 వేల మందికి బట్టల ప్యాకెట్లు పంపిణీ చేశామని ఆయన చెప్పారు. అత్యధికంగా విరాళాలు అందించిన దాతలలో అపెక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 60 లక్షల రూపాయల విలువచేసే ఆహారాన్ని, బట్టలను విరాళంగా అందించారని ఆయన తెలిపారు.
News Posted: 12 October, 2009
|