'మార్పును కోరుకుంటున్నారు' హైదరాబాద్ : కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో చీలికల్ని ప్రజలు అంగీకరించడం లేదని, అందువల్లే అవినీతి, అసమర్థత, కేంద్రీకృత వ్యవస్థ వంటి ఎన్ని లోపాలున్నా గుడ్డిలో మెల్ల రీతిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డా.జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. ' ప్రజలు గతంలో మాదిరిగా కాకుండా వ్యక్తిగత జీవితాల గురించి, భవిష్యత్తు గురించి, సమాజాభివృద్ది గురించి ఆలోచిస్తున్నారు. మార్పును వారు బలంగా కోరుకుంటున్నారు. అయితే ఉన్న పార్టీలలోనే ఏదో ఒకదానికి ఓటు వేయాల్సి వస్తోంది. సరైన ప్రత్యామ్నాయం ఉంటే వారు మద్దతివ్వటానికి సిద్ధంగా ఉన్నారు' అని జేపీ పేర్కొన్నారు.
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరిపాలన అందించినా తిరిగి అధికారంలోకి రాగలిగిందంటే అది కేవలం ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ విధానపరమైన దివాళాకోరుతనం వల్లేనని జేపీ స్పష్టం చేశారు. 'నారాయణ్ రాణే, ఛగన్ భుజబల్ ఇలా ఒక పార్టీలో ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినవారే మరో పార్టీకి మారి పదవుల్ని చేపడుతున్నారు. అన్ని పార్టీల్లో నాయకులు ప్రముఖుల వారసులే. ఏదో ఒక పార్టీకి ఓటు వేయాలి కాబట్టి, కాస్త మెరుగ్గా అన్పించిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు' అన్నారు. మూడు రాష్ట్రాల్లో గెలుపు కాంగ్రెస్ నాయకత్వానికో, విధానాలకో గుర్తింపు కాదన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా బలపడినట్టు కూడా ఆధారాలు లేవన్నారు. దేశంలో తృతీయ ఫ్రంట్ అవసరమున్నా, ఆ ప్రంట్ పేరుతో వస్తున్న పార్టీలు కూడా కాంగ్రెస్, బీజేపీలకు నకళ్ళుగా ఉండటంతో ప్రజలు వాటిపట్ల ఆసక్తిని చూపడం లేదన్నారు. ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా గెల్చినట్టే అనే ఎన్నికల వ్యవస్థను మార్చి దామాషా పద్ధతిని ప్రవేశపెట్టిన రోజున ప్రత్యామ్నాయ రాజకీయానికి మార్గం సుగమవుతుందన్నారు. మహారాష్ట్రలో ఎం.ఎన్.ఎస్ వల్ల ఓట్లు చీలి కాంగ్రెస్ లబ్ధి పొందిందనే వాదనను జేపీ కొట్టిపారేశారు. కేవలం ఓట్ల చీలిక వల్లే కాంగ్రెస్ లబ్ధి పొంది ఉంటే, హర్యానాలో కూడా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చి ఉండాలి అన్నారు.
News Posted: 23 October, 2009
|