జాడ లేని సీతమ్మ? మహబూబ్ నగర్ : దేవరకద్ర ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి ఆచూకీ తెలియడం లేదు. వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి ఆత్మహత్యకు కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో ఎవరూ చెప్పడం లేదు. రెండు రోజుల క్రితం రాజేశ్వరి వాంఙ్మూలం బయటపడటంతో ఎమ్మెల్యేపై 506, 306, 189 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నుండి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాల్లో తొమ్మిది మంది టిడిపి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న తరుణంలో సీతాదయాకర్ రెడ్డి ఓ మహిళా ఉద్యోగిని ఆత్మ హత్య కేసులో ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి శ్రేణులు అయోమయంలో పడ్డాయి. రాజేశ్వరి ఆత్మహత్య కేసు నమోదు కావడంతో కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కూడా జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతం సీతమ్మ ఆచూకీ లభించడం లేదని, ఆచూకీ లభించినా అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకుని అరెస్ట్ చేయాల్సి ఉంటందని, సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కాగా టిడిపికి చెందిన రాష్ట్రంలోని కొంతమంది ఎమ్మెల్యేలు శుక్రవారం శాసనసభ స్పీకర్ ను కలిశారు. ఎలాగైన సీతాదయాకర్ రెడ్డిని కేసు నుంచి బయపడేయడానికి తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేట్టు కనిపించడం లేదు.
News Posted: 24 October, 2009
|