చెరకు రైతుపై చిన్నచూపు హైదరాబాద్ : చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభమై నెలరోజులవుతున్నా ఇంతవరకూ రాష్ట్ర సలహా ధర ప్రకటించకపోవడం పట్ల లోక్ సత్తా పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీరు పూర్తిగా రైతు వ్యతిరేకంగా ఉందని లోక్ సత్తా అధికార ప్రతినిధులు లక్ష్మణ్ బాలాజీ, కె.గీతామూర్తి ఆరోపించారు. ఆరేడు సంవత్సరాలుగా సర్కార్ చెరకు పంట సలహా ధర విషయంలో ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఒక్కో ఫ్యాక్టరీ ఒక్కో విధంగా రైతులకు చెరకుపంటకు ధర చెల్లిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర ప్రకటించకపోవడం వల్ల గత సంవత్సరం కోస్తా జిల్లాల్లోని ఫ్యాక్టరీలు రైతులకు చెరకు టన్నుకు 1500, రాయలసీమల్ 1250, తెలంగాణ జిల్లాల్లో 1200 రూపాయలు చెల్లించి నిలువుదోపిడీకి పాల్పడ్డాయని లోక్ సత్తా ప్రతినిధులు దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా రైతు వ్యతిరేక విధానాలను విడనాడి ప్రజల ప్రయోజనం కోసం గిట్టుబాటు ధర కల్పించే చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ బాలాజీ, గీతామూర్తి డిమాండ్ చేశారు.
News Posted: 27 October, 2009
|