గ్రేటర్ లో లోక్ సత్తా 'ఈల' హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల్లో లోక్ సత్తా పార్టీకి 'ఈల' (విజిల్) గుర్తుని కామన్ సింబల్ గా కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అధికారిక ఉత్తర్వును అందజేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు నుంచి లోక్ సత్తా కార్యాలయానికి లిఖితపూర్వక సమాచారం అందిందని పార్టీ అధికార ప్రతినిధులు కటారి శ్రీనివాసరావు, వి లక్ష్మణ్ బాలాజీ తెలిపారు. 'రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొని ప్రజల మద్దతు పొందే ప్రక్రియలో సహాయకారి (ఫెసిలిటేటర్)గా వ్యవహరించే బాధ్యతను ఎన్నికల సంఘం పక్షపాతాలకు అతీతంగా నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ బజావ్... సిటీ బచావ్ (ఈల వేయండి... నగరాన్ని రక్షించండి) నినాదంతో ప్రజల్లో మంచి ఆదరణ పొందగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విశేష స్పందన లభించింది. తిరిగి అదే 'ఈల' గుర్తు లభించటం వల్ల ప్రజలను త్వరగా చేరగలుగుతాం' అని వారు పేర్కొన్నారు. పార్టీకి ఈల గుర్తు కేటాయింపు గురించి తెలియజేయడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే పార్టీ అభ్యర్థుల 3వ జాబితాను శ్రీనివాసరావు, లక్ష్మణ్ బాలాజీ గురువారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాకు విడుదల చేశారు.
News Posted: 30 October, 2009
|