కబ్జాల కాంగ్రెస్: బాబు ధ్వజం హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప గత ఐదున్నరేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధీ చేయలేదని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. అభివృద్ధి, కార్యదక్షత, ప్రజా సంక్షేమం, సమర్థ పాలనకు తెలుగుదేశం ప్రతీక అయితే, కబ్జాలు, అవినీతి, అక్రమాలు, రౌడీయిజం కాంగ్రెస్ సంస్కృతిగా ఉందన్నారు. మహేశ్వరం, కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన వెయ్యి మంది బిజెపి, బిజెవైఎం కార్యకర్తలు సోమవారం సాయంత్రం చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో పేదలకు జాగాలేదని, మధ్యతరగతికి ఇళ్ళు లేవని, మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని చంద్రబాబు దుయ్యబట్టారు. పచ్చదనాన్ని, పారిశుధ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిన కారణంగా నగరంలో ఏ ఇంటిలో చూసినా చికున్ గున్యా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, అంటువ్యాధులతో సతమతం అవుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, మధ్య తరగతి వారే బ్రతకలేని పరిస్థితి ఎదురైందన్నారు. పేదలు, సామాన్యుల సంగతి ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదని నిప్పులు చెరిగారు. నగరంలో శాంతి భద్రతలు కరవయ్యాయన్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, దేవ భాస్కరరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వర్ల రామయ్య, నగర పార్టీ నాయకులు సలీం, సుధీష్ రాంభొట్ల తదితరులు ఉన్నారు.
News Posted: 3 November, 2009
|