గ్రేటర్ రక్షణ బాధ్యత ఓటర్లదే హైదరాబాద్ : ప్రజల పక్షాన నిలిచే పార్టీ కేవలం లోక్ సత్తాయే అని ఆ పార్టీ నాయకులు భీశెట్టి బాబ్జీ, వి.లక్ష్మణ్ బాలాజీ, ఎన్.రవీందర్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మహా నగరాన్ని రక్షించుకునే బాధ్యత ఇప్పుడు నగరవాసులదే అని వారు పిలుపునిచ్చారు. సాంప్రదాయ, స్వార్ధపూరిత పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకో ఓటేస్తే భవిష్యత్ మళ్ళీ అంధకారమే అవుతుందని వారు హెచ్చరించారు. ఆ రెండు పార్టీల్లో దేనికి ఓటేసినా వృథా అవుతుందని, ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాదని, నాయకులు, వారి పిల్లల చుట్టూ తిరిగే పాత రాజకీయమే పునరావృతం అవుతుందన్నారు.
అభ్యర్థుల ఎంపికలో, ఎజెండాలో లోక్ సత్తాకు, మిగిలిన పార్టీలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ప్రజలు గుర్తించాలని బాబ్జీ, బాలాజీ, రవీందర్ గ్రేటర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారంనాడు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిహెచ్ఎంసి పరిధిలోని 140 డివిజన్లలో లోక్ సత్తా అభ్యర్థులను బరిలో నిలబెడుతున్నట్లు వారు పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థుల్లో దౌర్జన్యాలు, భూకబ్జాలు, కుంభకోణాల్లో ఉన్నవారు లేరన్నారు. లోక్ సత్తా అభ్యర్థుల్లో ఎవరూ నేర చరితులు లేరని, ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు పాల్పడబోమని, లోక్ సత్తా విధానాలకు కట్టుబడి వ్యవహరిస్తామని అభ్యర్థుల నుంచి నిర్దిష్టమైన హామీ పత్రాన్ని తీసుకుని ప్రమాణం చేయించిన తరువాతే టిక్కెట్లు కేటాయించినట్లు వారు తెలిపారు. అవినీతి తావు లేకుండా నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే 'ఈల' గుర్తుకు ఓటు వేసి నగరాన్ని రక్షించుకోవాలని లోక్ సత్తా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
News Posted: 6 November, 2009
|