'బెల్ట్ షాపులు మూయించండి'

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలంటే మద్యం ప్రవాహాన్ని తక్షణమే అడ్డుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ లేఖ రాశారు. జిహెచ్ఎంసి పరిధిలో అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపులను, సిట్టింగ్ గదులను వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎవిఎస్ రెడ్డికి లోక్ సత్తా అధ్యక్షుడు జేపి రాసిన లేఖ ప్రతిని శనివారంనాడు ఆ పార్టీ నాయకులు కటారి శ్రీనివాస్, భీశెట్టి బాబ్జీ, లక్ష్మణ్ బాలాజీ, సరోజాదేవి మీడియాకు విడుదల చేశారు.
మద్యాన్ని ఆదాయ మార్గంగా చేసుకొన్న రాష్ట్రప్రభుత్వం వేలంపాటల ద్వారా మద్యం దుకాణాలను అత్యధిక స్థాయి బిడ్డర్లకు కేటాయిస్తోందని, ఇలా ఒక్కో దుకాణానికి కోటి రూపాయల వరకూ పలుకుతోందని, దుకాణ యజమానులు అధిక లాభాల కోసం బెల్ట్ షాపులు బార్లా తెరిచేందుకు సర్కార్ వత్తాసు పలుకుతోందని జేపి ఈసీకి వివరించారు. మద్యం సీసాలను ఓటర్లకు లోపాయికారీగా పంపిణీ చేస్తుండడంతో సాక్ష్యాధారాలతో నిరూపించడం కష్టంగా ఉందని ఈ పరిస్థితికి ఆస్కారం లేకుండా జిహెచ్ఎంసి పరిధిలోని బెల్టు షాపులను వెంటనే మూసివేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని జేపి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో పరిమిత కాలం పాటు లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలను ఎన్నికల అధికారులు మూసివేయిస్తుంటారని ఆయన తెలిపారు. అయితే, అక్రమ బెల్టు షాపులు ఆ ఆదేశాలను పట్టించుకోవని, 24 గంటలూ మూల మూలలా మద్యాన్ని అందుబాటులో ఉంచుతుంటాయన్నారు.
2009 ఎన్నికల్లో ఎన్నికల సంఘం మద్యం దుకాణాలను మూసివేస్తూ తీసుకున్న చర్యలు విజయవంతం అయ్యాయని జేపి తన లేఖలో గుర్తుచేశారు. గ్రేటర్ ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది కనుక బెల్టుషాపుల మూసివేతకు కఠిన చర్యలు తీసుకోవాలని జేపి కోరారు. కాగా, స్థానిక రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా సుప్రీంకోర్టు పట్ల నిబద్ధతతో జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రశంసించారు.
News Posted: 7 November, 2009
|