ఎండమావి వెంట తెరాస దౌడు హైదరాబాద్ : 1975 రాష్ట్రపతి ఉత్తర్వుపై సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యాలు చెప్పి లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయమ్ కు లేనిపోని పక్షపాతాలు అంటగట్టడం ద్వారా ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సత్తా దుయ్యబట్టింది. కేవలం రాజకీయ ఉనికి కోసమే తెరాస ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని లోక్ సత్తా నాయకులు కటారి శ్రీనివాసరావు, వి. విజయేందర్ రెడ్డి, రవల ఝాన్సీలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు జేపిపై చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. హరీష్ రావు ఆరోపిస్తున్నట్లు హైదరాబాద్ ఫ్రీ జోన్ అని జేపి ఎక్కడా పేర్కొనలేదని వారు స్పష్టం చేశారు. ఫ్రీ జోన్ అనే పదం రాష్ట్రపతి ఉత్తర్వులో, దాన్ని కొనసాగిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు ఉత్తర్వులో ఎక్కడా లేదని జేపి పదే పదే చెబుతున్నారని లోక్ సత్తా నాయకులు వివరించారు. అయితే, హరీష్ రావు వాస్తవాన్ని మరుగుపరిచే యత్నం చేస్తున్నారని, జేపిపైన, లోక్ సత్తా పైన లేనిపోని ఆరోపణలు చేస్తుండడం క్షమార్హం కాదని హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
గత ఎన్నికల్లో దారుణంగా చావుదెబ్బ తిన్న తెరాస ఏదోవిధంగా ప్రజల్లో ఉద్రేకాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఉనికిలోనే లేని ఫ్రీ జోన్ పై యాగీ చేస్తోందని లోక్ సత్తా నాయకులు ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వును, ఆరు పాయింట్ల ఫార్ములాను, 610 జీఓను నిక్కచ్చిగా, నిజాయితీగా అమలు చేసేందుకు లోక్ సత్తా కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఒక్కటే సర్వరోగ నివారిణి కాదన్నారు. వెనుకబాటుతనాన్ని ఎదుర్కొనేందుకు లోక్ సత్తా 'జిల్లా ప్రభుత్వాల ఏర్పాటు'ను ప్రతిపాదిస్తున్నదన్నారు.
News Posted: 9 November, 2009
|