'గ్రేటర్' ప్రచారానికి జేపి

హైదరాబాద్ : మంగళవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని లోక్ సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ చేపడుతున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 20 వరకూ ఆయన వివిధ డివిజన్లలో పర్యటించి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం ఉదయం 10.30 గంటలకు పూలమాల వేసి జేపి ప్రచారం ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి నాచారం మీదుగా దుర్గానగర్ కాలనీ చేరుకొని అక్కడ ప్రజలతో ముఖాముఖి నిర్వహించి విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, రక్షిత మంచినీరు తదితర సమస్యలను జేపి అడిగి తెలుసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు లోక్ సత్తా పరిష్కారాలను, వాటిలో ప్రజల భాగస్వామ్యం గురించి ఈ సందర్భంగా ప్రజలకు ఆయన వివరిస్తారు. లోక్ సత్తా రూపొందించిన వార్డు మేనిఫెస్టోను జేపి తెలియజేస్తారు. ఈ క్రమంలో వార్డు మేనిఫెస్టో లేని డివిజన్ల అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయబోరని పార్టీ అధికార ప్రతినిధి కటారి శ్రీనివాసరావు తెలిపారు.
మెహిదీపట్నం మేనిఫెస్టో విడుదల :
మెహిదీపట్నం డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలు, వాటికి లోక్ సత్తా శాశ్వత పరిష్కారాలను కళ్ళకు కట్టినట్లు చూపించే మేనిఫెస్టోను జయప్రకాష్ నారాయణ్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెహిదీపట్నం డివిజన్ లోక్ సత్తా అభ్యర్థి రావుల మాణిక్ ప్రభు, పార్టీ నాయకులు జి.గణేష్ ముదిరాజ్, పి.సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 9 November, 2009
|