'గాలి' ముందు మోకరిల్లారు హైదరాబాద్ : కర్ణాటక మంత్రులైన గాలి సోదరులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప తలొగ్గారని లోక్ సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఎద్దేవా చేశారు. ఈ సంఘటన ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు సంచుల పోషిస్తున్న వికృత పాత్రను కళ్ళకు కట్టినట్లు స్పష్టం చేస్తోందన్నారు. దక్షిణ భారతదేశంలో లేక లేక వచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న తపనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యడ్యూరప్ప వ్యతిరేక శిబిరం ముందు మోకరిల్లిందని జేపి దుయ్యబట్టారు. 'రాజ్యాన్ని దోచుకుని సంపాదించిన డబ్బుతో గాలి సోదరులు రాజకీయాలనే శాసించే స్థితికి చేరుకున్నారు' అని జేపి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాత్కాలిక ప్రయోజనాల కోసం అలాంటి దోపిడీ శక్తుల పట్ల ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శించి వారు ఎదిపోయేందుకు అవకాశం కల్పించిన జాతీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, తమ అదికార దాహం కారణంగా ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగుతున్న విషయాన్ని గుర్తించాలని జేపి సూచించారు. ఆశ్రిత రాజకీయాల ద్వారానే జార్ఖండ్ గనుల శాఖ మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని జేపి ఆరోపించారు.
'టెలికాం స్పెక్ట్రమ్, గనుల హక్కులు... ఇలా మొదట వచ్చిన వారికి మొదటి అవకాశం' రీతిలో ఇచ్చేశారని ఇలాంటి ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ డిమాండ్ చేశారు. వాటి స్థానంలో అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ నిర్వహించాలని, వేలం ద్వారా అత్యధిక బిడ్ చేసిన వారికే వాటిని కేటాయించాలని, ప్రజా ధనం దోపిడీని అడ్డుకోవాలని జేపి డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఎంఎన్ఎస్ ఎమ్మెల్యేల దురాగతాన్ని జేపి తీవ్రంగా ఖండించారు. కేవలం మరాఠీలో ప్రమాణ స్వీకారం చేయలేదన్న నెపంతో ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న సంఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ ఎమ్మెల్యేలను వారి అనుచిత, రాజ్యాంగ వ్యతిరేక ప్రవర్తన కారణంగా వారిని సస్పెండ్ మాత్రమే చేయకుండా వెంటనే సభ నుంచి బహిష్కరించాలని జేపి వ్యాఖ్యానించారు.
News Posted: 10 November, 2009
|