వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు హైదరాబాద్ : పబ్లిక్ గార్డెన్స్‌లోని తెలుగు లలితకళా తోరణంలో అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తున్నాయి. సోమవారం వివిధ పాఠశాలల బాలలతో పాటు మానసిక వికలాంగుల బాలబాలికలు సైతం తమ కళాప్రతిభను చాటుకున్నారు. స్టార్ బాల యాంకర్‌లుగా పేరు తెచ్చుకున్న కోమలి సిస్టర్స్ ఆద్యంతం హుషారైన యాంకరింగ్‌తో పిల్లలను, పెద్దలను సైతం ఆకట్టుకుంటున్నారు. ఈ ప్రదర్శనల్లో స్వీకార్ ఉపకార్ మానసిక వికలాంగులు సోమవారం కార్తీమాస పుణ్యదిన సందర్భంగా శివలింగం సెట్టింగ్‌తో శంకర.. శంకర.. శంభో.. అంటూ శివస్తుతి గీతంతో భక్తరస భరితమైన నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.
అలాగే నారాయణగూడకు చెందిన నారాయణ కాన్సెప్ట్ స్కూలు విద్యార్థు లు.. పల్లెతల్లి గొప్పతనాన్ని, ఆత్మీయానుబంధాలను వర్ణిస్తూ చక్కని జాపపద నృత్యంతో అలరించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగాను, నటీనటులు సుహాసిని, తారకరత్న, మాస్టర్ ఆకాశ్, జీవితలు ప్రత్యేక అతిధులుగా విచ్చేసి బాల కళాకారులను అభినందించారు. ఈ సందర్భంగా జీవిత మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ బాలల చిత్రాలకు ఇటు పెద్ద చిత్రాల నిర్మాతలతో పాటు అటు ప్రభుత్వం వైపునుంచి కూడా ప్రోత్సాహం తప్పక లభించాలని ఆకాంక్షించారు.
News Posted: 17 November, 2009
|