చెరకుపై అఖిలపక్షం: లోక్ సత్తా హైదరాబాద్ : చెరకు సంక్షోభంపై చర్చించి పరిష్కారం కనుగొనేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లోక్ సత్తా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సర్కారు ఉదాసీనత కారణంగానే అటు రైతులు, ఇటు వినియోగదారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని లోక్ సత్తా ఆవేదన వ్యక్తం చేసింది. మార్కెట్ లో చక్కెర ధర ఎన్నడూ లేని విధంగా 40 రూపాయలు అమ్ముతుండడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లోక్ సత్తా నాయకులు భీశెట్టి బాబ్జీ, వి. లక్ష్మణ్ బాలాజీ, జి. రాజారెడ్డి విచారం వ్యక్తం చేశారు. చక్కెర కొని వినియోగించుకోలేక ప్రజలు నానా అవస్థా పడుతుంటే రాష్ట్ర సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బుధవారం వారు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుయ్యబట్టారు.
ఖాయిలా పడిన చక్కెర పరిశ్రమలను, సహకార రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దానిలో భాగంగానే 'ఎపిట్కో' సంస్థతో సర్వే చేయించిందని లోక్ సత్తా నాయకులు ఆరోపించారు. చక్కెర పరిశ్రమ సంక్షోభానికి మూల కారణమైన చెరకు పంటపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. చెరకు పంటకు జాతీయ ప్రభుత్వం ప్రకటించిన సరసమైన, గిట్టుబాటు ధరను సాకుగా చూపి రాష్ట్రప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుందని, టన్నుకు మొక్కుబడిగా 60 రూపాయలు రాయితీ ప్రకటించి, రైతులను పూర్తిగా ఫ్యాక్టరీ యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలేసిందని లోక్ సత్తా నాయకులు ఆరోపించారు.
News Posted: 18 November, 2009
|