'మార్పు' కోసం ఏకమవుదాం హైదరాబాద్ : ప్రజలు - లోక్ సత్తా ఏకమైతేనే సమాజంలో మార్పు వస్తుందని లోక్ సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఎన్నికలు మన కోసమే అనే చైతన్యం ప్రజల్లో రావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారంనాడు సనత్ నగర్ డివిజన్ లో మాట్లాడారు.
ప్రజల చేతికి అధికారం వస్తేనే సమాజం మారుతుందని జేపి పేర్కొన్నారు. మనలను పరిపాలించే అధికారం వేరెవరికో ఇస్తే ఇక మార్పు ఎలా వస్తుందని ఆయన ఓటర్లను ప్రశ్నించారు. సంప్రదాయ పార్టీలు చేసే మేజిక్కులకు మోసపోద్దని ఆయన హితవు పలికారు. 'ఓటు లోక్ సత్తాకు - అధికారం ప్రజలకు' అనేది లోక్ సత్తా ఎజెండా అన్నారు. ఓటు విలువ, వినియోగం పట్ల జనంలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని జేపి పేర్కొన్నారు. అమలు కాని హామీలతో మభ్యపెట్టి తమ పబ్బం గడుపుకునే వారు ఎన్నికల సమయంలో చాలామంది వస్తుంటారని వారిని నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. జనం చేతిలో అధికారం పెట్టాలన్న ఉద్దేశంతోనే తాము ప్రజలకు నచ్చినవారిని, వారు మెచ్చేవారిని, స్థానిక అవసరాలు తీర్చి ప్రజాసేవ చేసేవారనే అన్నిచోట్లా లోక్ సత్తా అభ్యర్థులుగా నిలబెట్టామన్నారు. 'ఈల వేయండి - నగరాన్ని రక్షించండి' అనే లోక్ సత్తా నినాదంతో నగర ప్రజలంతా గొంతు కలపాలని జయప్రకాశ్ నారాయణ్ పిలుపనిచ్చారు.
News Posted: 18 November, 2009
|