కార్పొరేటర్లకు బాబు ఉపదేశం

హైదరాబాద్ : ప్రజల ఆరోగ్యం, విద్యుత్ కొరత, రోడ్ల మరమ్మతులు, ట్రాఫిక్ జామ్, మంచినీటి ఇబ్బంది లాంటి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్పొరేటర్లకు ఉపదేశించారు. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటల నుంచే తమ తమ డివిజన్లలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులు ఆక్రమించిన భూముల వివరాలు సేకరించి వాటిని అర్హులకు కేటాయించేలా ఉద్యమించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన కార్పొరేటర్లతో చంద్రబాబు నాయుడు సోమవారంనాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకే ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో ఆశీర్వదించారన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలా ఒత్తిడి తీసుకురావాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు తదితర విషయాలను కార్పొరేటర్లకు త్వరలోనే నిర్వహించే శిక్షణ శిబిరంలో అవగాహన కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. పార్టీ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా కృషి చేయాలని చంద్రబాబు కార్పొరేటర్లకు సూచించారు. టిడిపి కార్పొరేటర్లుగా విజయం సాధించిన వారికి చంద్రబాబు అభినందించారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 30 November, 2009
|