సజావుగా అసెంబ్లీ హైదరాబాద్ : గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సభలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహిస్తున్నారు. గత ముడు రోజులుగా తెలంగాణ సమస్యపై అసెంబ్లీ అట్టుడికిపోయి, అర్ధంతరంగా మరుసటి రోజుకు వాయిదాలు పడిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు రాజకీయ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్రం అంగీకరించడం, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ప్రవేశపెడతామని హామీ ఇవ్వడంతో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష విరమించారు. దీనితో తెరాస సభ్యులు సభలో ప్రశాంతంగా ఉన్నారు. విద్యార్థులు ఈ రోజు నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీని రద్దు చేసుకున్నారు. దీనితో తెలంగాణలో 144 వ సెక్షన్ నిషేధాజ్ఞలను ఎత్తివేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఐజి అనూరాధ తెలిపారు.
News Posted: 9 December, 2009
|