'టి' ఎమ్మెల్యేలను ఒప్పిస్తాం హైదరాబాద్ : ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉండాలని తెలంగాణ ఎమ్మెల్యేలను ఒప్పిస్తామని ప్రభుత్వ విప్ శైలజానాథ్ పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో బుధవారం సమావేశమైన ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. దీని కోసం జిల్లాల వారీగా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రామాలు చేపడతామన్నారు.
నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులపై తెలంగాణ వాదుల దాడిని శైలజానాథ్ ఈ సందర్భంగా ఖండించారు. అవసరమైతే తెలంగాణలో సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర చేస్తామని, తెలంగాణ వాదులను వేడుకొని అయినా ఒప్పిస్తామన్నారు. తెలంగాణ ఇవ్వాలంటూ పొలిట్ బ్యూరోలో టిడిపి తీర్మానం చేసిందని, ఇప్పుడు మాట మార్చి సమైక్యాంధ్ర అంటోందని ఎద్దేవా చేశారు. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న టిడిపి దుష్ప్రచారాన్ని ప్రజల్లోనే తిప్పికొడతామని శైలజానాథ్ అన్నారు.
News Posted: 23 December, 2009
|