ఆందోళనలు విరమించండి హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై ఆరోగ్యకరమైన రీతిలో చర్చలు జరిగి, ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరేందుకు తగిన వాతావరణం కల్పించాలని లోక్ సత్తా పార్టీ విజ్ఞప్తి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆందోళనలు, బంద్ లు, నిరాహారదీక్షలు, రైల్ రోకోలు వెంటనే నిలిపివేయాలని లోక్ సత్తా పార్టీ నాయకులు కటారి శ్రీనివాసరావు, వై.డి. రామారావు, పి.రవి మారుత్, వి.విజయేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్ సత్తా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బంద్ లు, హింసాత్మక ఘటనలు, విద్వేషాల మధ్య నలుగుతూ నిర్వేదానికి గురైన ప్రజలలో సానుకూల దృక్పథాన్ని, ఐకమత్య భావనను పెంపొందించే దిశగా మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని వారు కోరారు.
తెలంగాణపై తీర్మానం విషయంలో పార్టీల తీరు వల్ల ఇప్పటికే ఆయా పార్టీలు విశ్వసనీయత కోల్పోయాయని, ప్రజలు - పార్టీల మధ్య పెద్ద అగాధం ఏర్పడిందని లోక్ సత్తా అభిప్రాయపడింది. ఇప్పటికైనా పార్టీలు, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలకు కార్యకర్తలెవరూ పాల్పడకుండా పార్టీలు, నాయకులు చర్యలు చేపట్టాలని కోరారు. అన్ని ప్రాంతాల ప్రజలూ సంయమనంతో వ్యవహరించాలని లోక్ సత్తా పిలుపునిచ్చింది.
News Posted: 23 December, 2009
|