హైదరాబాద్ : తెలంగాణపై చిదంబరం ప్రకటనతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం ఉదయం మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వర్శిటీలో పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. క్యాంపస్ ను పోలీసులు వెంటనే ఖాళీచేసి వెళ్ళిపోవాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. చిదంబరం ప్రకటనపై చివ్వున లేచిన ఓయు విద్యార్థులు వర్శిటీలో ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు. దీనితో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కొందరు విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులు - పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మరో పక్కన కేంద్రం ప్రకటనకు నిరసగా విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సమాయత్తం అవుతున్నారని సమాచారం. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన పరీక్షలను వైస్ చాన్స్ లర్ వాయిదా వేశారు.