'సత్తా' చర్చా వేదికలు హైదరాబాద్ : చర్చలు అభిప్రాయ భేదాలను తొలగిస్తాయని, అందరికీ సానుకూలమైన మార్గాన్ని చూపిస్తాయని, ఇలాంటి సంప్రతింపుల తరువాత తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నయినా లోక్ సత్తా స్వాగతిస్తుందని ఆ పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన లోక్ సత్తా పార్టీ బృందాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మున్సిపాల్టీలలో చర్చా వేదికలు నిర్వహిస్తాయని, రాష్ట్ర విభజన జరగడం, జరగకపోవడం వల్ల వచ్చే లాభనష్టాల గురించి ప్రజల నుంచి వాస్తవాలను అవి తెలుసుకుంటాని జేపి తెలిపారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్ సత్తా కార్యాలయంలో సోమవారం ఈ సమావేశం జరిగింది. కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో కూడా గ్రామసభలు నిర్వహిస్తామని జేపి పేర్కొన్నారు.
దినపత్రికల హెడ్ లైన్లు, న్యూస్ చానెళ్ళ వార్తా బులెటిన్ చూసి ఎజెండాను మార్చుకోవాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు జేపి ఉద్బోధించారు. నిజమైన నాయకత్వం ప్రజలను ముందుకు నడిపించడంలో ఉంటుందన్నారు. తాత్కాలిక ఉద్రేకాలకు లోను కావద్దన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు దిక్సూచీలా వ్యవహరించాలే గాని గాలిమరలా కాదన్నారు. రాష్ట్ర విభజన కోసం జరుగుతున్న ఆందోళనలను లోక్ సత్తా అంత తీవ్ర ప్రాధాన్యత గల అంశంగా పరిగణించడం లేదని జేపి స్పష్టం చేశారు. పౌరుల స్వేచ్ఛకు, లౌకిక వాదానికి భంగం కలిగితే అది ప్రాధాన్యత గల సమస్య అవుతుంది తప్ప తెలంగాణ ఏర్పాటు లేదా సమైక్యాంధ్ర అనేది కేవలం రాజకీయ, పరిపాలనాపరమైన ఏర్పాటు మాత్రమే అన్నారు.
ఢిల్లీలో ఇటీవలి తన పర్యటనలో రహస్య ఎజెండా ఏదీ లేదని జేపి స్పష్టం చేశారు. లోక్ సత్తాకు పబ్లిక్ ఎజెండాయే గాని ప్రైవేట్ ఎజెండా ఏనాడూ లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పునఃప్రతిష్టించడం, పాలనా వ్యవహారాలు సజావుగా సాగించడానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రమే జాతీయ పార్టీల నాయకులకు తాను సూచించానన్నారు.
News Posted: 29 December, 2009
|