మంత్రి దానం ఘెరావ్ నల్గొండ : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్‌ను నల్గొండ జిల్లా ఆలేరులో తెలంగాణ వాదులు శనివారం అడ్డుకుని ఘెరావ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవులకు రాజీనామా చేసిన తరువాతే తమ ముందుకు రావాలని, లేకపోతే తెలంగాణలో ఎక్కడా తిరగనివ్వబోమని ఆందోళనకారులు నినాదాలు చేశారు. తాజా పరిణామంతో దానం కంగుతున్నట్టయింది. గ్రేటర్ హైదరాబాద్ లక్ష్యంగా దానం గతంలో ప్రత్యేక తెలంగాణపై అంతగా శ్రద్ధ చూపలేదు. దీంతో ముందు నుంచీ ఆయనపై గుర్రుగా ఉన్న తెలంగాణవాదులు ఘెరావ్ చేయడం ద్వారా తమ నిరసన వెల్లడించారు.
‘నేడు దానం నాగేందర్ కు పట్టిన గతే ఇతరులకూ పడుతుంది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేవారు గాని, పదవులకు రాజీనామాలు చేయని వారు గానీ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చేందుకు అర్హులు కారు’ అంటూ తెలంగాణవాదులు వ్యాఖ్యానించారు. తెలంగాణపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని, లేకపోతే భారీగా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News Posted: 16 January, 2010
|