జ్యోతి బసుకు జేపి నివాళి హైదరాబాద్ : మార్క్కిస్టు నాయకుడు జ్యోతి బసుకు ఉన్న 'అసాధారణ నియంత్రణ, పరస్పరం సంఘర్షించే ప్రయోజనాలను సమన్వయం చేయడం, భారత్ వంటి భిన్నత్వం ఉన్న సమాజంలో మధ్యేమార్గాన్ని అనుసరించడం' లక్షణాలను అలవలరచుకోవడమే ఆయనకు మనం అంతా ఇచ్చే ఘన నివాళి అని లోక్ సత్తా అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలోని అతి పెద్ద నాయకుల్లో జ్యోతి బసు ఒకరని, ఆయన మృతి పశ్చిమ బెంగాల్ కే కాక యావత్ దేశానికే తీరని లోటు అన్నారు. జ్యోతి బసు ముఖ్యమంత్రిగా పనిచేసిన సుదీర్ఘ కాలాన్ని ఆయన గొప్పతనానికి కొలమానంగా చూడడం అంటే ఆయనను అవమానించడమే అన్నారు.
మన దేశంలో సంకీర్ణ రాజకీయాల కీలక నిర్మాతల్లో జ్యోతి బసు ఒకరని జేపి ప్రస్తుతించారు. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నా, తన పరిమితులను గుర్తించి దేశ సుస్థిరత, సంక్షేమం దృష్ట్యా విభిన్న రాజకీయ దృక్పథాల మధ్య స్నేహ వారధి నిర్మించే విజ్ఞతను, ముందుచూపును ఆయన ప్రదర్శించారన్నారు.
News Posted: 18 January, 2010
|