41 లక్షలతో డ్రైవర్ పరార్
హైదరాబాద్ : ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన కారు డ్రైవర్ కారుతో సహా 41 లక్షల రూపాయలు తీసుకొని పరారైన సంఘటన సోమవారంనాడు హైదరాబాద్ శివారు హబ్సిగూడ సమీపంలోని మల్లాపూర్ లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీనితో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. చుట్టుపక్కల అన్ని పోలీస్ స్టేషన్ లనూ అప్రమత్తం చేశారు. సిఎంఎస్ సంస్థ పెట్రోలు బంకుల నుంచి వసూలు చేసిన డిపాజిట్ సొమ్ములతో పాటు కారును తీసుకొని పరారయ్యాడు. మల్లాపూర్ లోని షెల్ పెట్రోలు బంకు వద్ద సోమవారంనాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. సిఎంఎస్ సంస్థ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. సొమ్ములతో పారిపోయిన డ్రైవర్ ఆచూకీ గాని, కారును గుర్తుపట్టినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రభాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు.
News Posted: 1 February, 2010
|