బంతి మళ్ళీ పార్టీల కోర్టులోనే హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ఊహించిన విధంగానే ఉన్నాయని లోక్ సత్తా పార్టీ వ్యాఖ్యానించింది. తెలంగాణ అంశంపై సంప్రదాయ రాజకీయ పార్టీల తీరు వల్లే రాష్ట్రం భావోద్వేగాలపరంగా రెండుగా చీలిపోయిందని, పరిస్థితి ఇంత దూరం వచ్చాక పరిష్కారానికి చర్చలే మార్గమని లోక్ సత్తా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇరు పక్కలా ఉన్న రాజీకీయ పార్టీలు, పౌరసమాజ సంస్థలు, విద్యార్థులు, ఇతర వర్గాలవారూ సుహృద్భావ, సామరస్య వాతావరణం నెలకొల్పి, సమస్యల అధ్యయనానికి కమిటీకి సహకరించాలని లోక్ సత్తా నాయకులు కటారి శ్రీనివాసరావు, వి.లక్ష్మణ్ బాలాజీ, వి. విజయేందర్ రెడ్డి అన్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల ప్రకటించిన తరువాత శుక్రవారం మధ్యాహ్నం లోక్ సత్తా కేంద్ర కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
శ్రీకృష్ణ కమిటీ సేవలం అధ్యయన కమిటీ మాత్రమే అని, సూచనలు మాత్రమే అది అందిస్తుందని గుర్తెరిగి దాన్ని సజావుగా పనిచేయనివ్వాలని లోక్ సత్తా ప్రతినిధులు సూచించారు. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదని, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడింది అసలే కాదని అందువల్ల దీనికి నివేదించడం తప్ప నిర్ణయాలు చేసే అధికారం ఉండబోదని వారు స్పష్టం చేశారు. అంటే అంతిమంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ మాత్రమే ఏ నిర్ణయమైనా తీసుకోవాలన్నారు. దరిమిలా బంతి మళ్ళీ రాజకీయ పార్టీల కోర్టులోనే ఉన్నట్లైందన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నిపుణులతో కూడినదైనందున రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపైన అధ్యయనం చేసి వాస్తవాలను నిర్ధారిస్తుందని, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని లోక్ సత్తా ప్రతినిధులు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం, సమైక్యాంధ్రను ఏకకాలంలో ఏ శక్తీ నెరవేర్చే ప్రశ్నే లేదు కాబట్టి హుందాగా చర్చల ద్వారా మాత్రమే శాశ్వత, న్యాయబద్ధ పరిష్కారం సాధ్యమవుతుందని తమ పార్టీ తొలి నుంచి చెబుతున్నదని వారు చెప్పారు.
News Posted: 12 February, 2010
|