శోభారాణి ఇంటిపై దాడి హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు శోభారాణి ఇంటిపై బుధవారంనాడు తెలంగాణ వాదులు దాడికి దిగారు. అమీర్ పేట పక్కనే ఉన్న ఎల్లారెడ్డిగూడలో ఉన్న శోభారాణి ఇంటిపై రాళ్ళు రువ్వి, ఇంటి ఆవరణలో ఉన్న పూలు, మొక్కల కుండీలను ధ్వంసం చేసి అల్లరి చేశారు. దాడి సమయంలో శోభారాణి తన నివాసంలోనే ఉన్నారు. తెలంగాణకు సానుకూల నినాదాలు చేస్తూ వారు దాడిచేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా శోభారాణి పనిచేస్తున్నారని ఆరోపణతో వారంతా ఈ దాడికి దిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శోభారాణి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం తెలంగాణ వాదులకు ఆగ్రహం తెప్పించింది. దాడి సందర్భంగా 'జై తెలంగాణ' నినాదం చేయాలంటూ శోభారాణిని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
కాగా, తెలంగాణ వాదులు తన ఇంటిపై దాడి చేయడాన్ని శోభారాణి ఖండించారు. ఉద్యమం పేరు చెప్పి ఇలా ప్రత్యక్ష దాడులకు తెలంగాణ వాదులు పాల్పడుతున్నా టీజేఏసీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదన్నారు. తాను సమైక్యాంధ్ర కోసం పనిచేస్తానని, ఎవరు అడ్డొస్తారో చూస్తానని శోభారాణి సవాల్ చేశారు.
News Posted: 17 February, 2010
|